Home / Breaking News  / నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌ , కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే

నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్‌ , కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్ పర్యటనకు వస్తున్నారు. కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో జరుగుతున్న ఈప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించడంతో పాటు జగిత్యాల జిల్లాలో వరదకాలువల ద్వారా రివర్స్‌ వాటర్‌ పంపింగ్‌ పనులను కూడా ఆయన పరిశీలించనున్నారు.కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన మూడురోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఆయన సందర్శించే ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశాలు, హెలిప్యాడ్‌ల ఏర్పాటు, బస చెసే ప్రదేశాల వద్ద ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా కరీంనగర్‌కు చేరుకుంటున్న కేసీఆర్‌ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌లో బస చేయనున్నారు.

గురువారం ఉదయం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరే సీఎం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌజ్‌ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్టు సైట్‌లోనే అధికారులతో సమీక్షిస్తారు. అదే రోజు రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలంలోని లక్ష్మిపూర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీపనులు, సొరంగ నిర్మాణాలు, పవర్‌హౌజ్‌, గ్రావేట్‌ కాలువ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు ఈప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్‌ సర్వే ద్వారా కూడా పరిశీలించనున్నారు.

18 లక్షల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ చేసే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2018 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ఆయకట్టుకు నీటిని అందిస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టుకు అటవీ అనుమతులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది.ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాన గోదావరి నీటిని మేడిగడ్డ ప్రాంతం నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎగువలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తరలిస్తారు. ఎల్లంపల్లి నుంచి ఈ నీటిని ప్రత్యేక లిఫ్టులు, టన్నెళ్ల ద్వారా మల్లన్నసాగర్‌లోకి తీసుకొస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.