Wednesday, November 22, 2017
BREAKING NEWS
Home / Breaking News  / నీటి గురువు విద్యాసాగర్ రావు ఇకలేరు , విద్యన్నమరణం పట్ల కలత చెందిన సిఎం కేసీఆర్‌

నీటి గురువు విద్యాసాగర్ రావు ఇకలేరు , విద్యన్నమరణం పట్ల కలత చెందిన సిఎం కేసీఆర్‌

హైదరాబాద్ : నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు ఆర్ విద్యాసాగర్ రావు(78) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగ‌ర్‌రావుకు ఇద్దరు సంతానం(అమ్మాయి, అబ్బాయి) ఢిల్లీలో సెటిల‌య్యారు. విద్యాసాగర్ రావును క్యాన్సర్‌‌ రక్కసి వెంటాడింది. కీమోథెరపీ చేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది.

తెలంగాణ నీటి పారుదల రంగానికి విద్యాసాగర్ రావు జీవగర్ర లాంటి వారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగు,సాగునీటి రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పోరాడిన వ్యక్తి. ప్రజలకు అర్ధమయ్యేలా నీళ్ల పంపిణీ అన్యాయాలను వివరించిన ఇంజనీర్. నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో 1939 నవంబర్ 14న విద్యాసాగర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీలో పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.

1979లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ నుంచి జలవనరుల విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అమెరికాలో కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమో కూడా చేశారు. నీటి వనరులు వాటి వినియోగంపై పూర్తి అవగాహన కలిగిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర రావు. 1997లో చీఫ్ ఇంజినీర్‌గా కేంద్ర జలవనరుల శాఖలో పదవీవిరమణ చేశారు. కేంద్ర ప్రణాళికాసంఘం 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్‌ గ్రూపులో సభ్యులుగా పనిచేశారు. నాబార్డు, ప్రపంచబ్యాంక్‌ సంబంధిత ప్రాజెక్టులకు కేంద్ర ఇంటిగ్రేటెడ్‌ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సలహాదారుగా పనిచేశారు.

కేంద్ర జలవనరులసంఘం చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన విద్యాసాగర్ రావుకు జలవనరులపై పూర్తి పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ వ్యవహారాలకు ఒకరకంగా చెప్పాలంటే ఆయనే పెద్ద దిక్కు. తెలంగాణ ప్రభుత్వానికి నీటి పారుదల రంగ సలహాదారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించిన వ్యక్తి. తెలంగాణకు నీళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై సరళమైన తెలుగు భాషలో ప్రజలందరికీ అర్ధమయ్యేలా చెప్పిన ఘనత విద్యాసాగరరావుది. సాగునీటి రంగంపై వివిధ పత్రికల్లో దాదాపు 100 కుపైగా వ్యాసాలు రాశారు. నీళ్లు-నిజాలు పేరుతో ఓ వ్యాస సంపుటిని కూడా ప్రచురించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ తో కలసి పాల్గొన్నారు..ఉమ్మడి రాష్ట్ర హయాంలో సాగు, తాగునీటి రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రజలకి అవగాహన కల్పించడంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో కలసి అడుగులో అడుగేశారు.

విద్యాసాగర్ రావు   ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ప్రాణాలు దక్కించడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చేసిన కృషి, తెలంగాణ జాతి చేసిన ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుందని భావించానని అన్నారు.

ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే స్వప్న సాకారంలో భాగస్వామిగా ఉండాల్సిన విద్యాసాగర్ రావు అర్థాంతరంగా మనల్ని వదిలివెళ్లారన్నారు. తనకు విద్యాసాగర్ రావు మంచి మిత్రుడని,మొదటి నుంచి కుటుంబ సభ్యుడిగా,తనకు పెద్దన్నలాగా వ్యవహరించేవారని సిఎం అన్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.