Monday, October 23, 2017
BREAKING NEWS
Home / Breaking News  / రేపు రాజన్న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన

రేపు రాజన్న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాదు: జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజన్న సిరిసిల్ల వస్తుండటంతో స్వాగత ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. రేపు దాదాపు 850 కోట్ల విలువైన కొత్త పథకాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 93 ఎకరాల్లో అధునాతన హంగులతో నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి, 30 కోట్లతో చేపడుతున్న రెండో రింగ్‌రోడ్డు పనులకు, 80 ఎకరాల్లో అపెరల్ పార్క్‌కు, 553 కోట్లతో నిర్మిస్తున్న మల్కపేట జలాశయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఈనెల 11న సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను అధికారులు శనివారం పరిశీలించారు. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో ఎస్పీ విశ్వజిత్, జేసీ యాస్మిన్ బాషా, డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు బైపాస్‌రోడ్డులోని కలెక్టరేట్ నిర్మాణ స్థలంతో పాటు బహిరంగ సభ కోసం స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు, పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అప్రమత్తం చేయడంతో పాటు వారితో ఏర్పాట్లపై సమీక్షించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమీకృత నూతన జిల్లా కలెక్టరేట్ల భవన నిర్మాణాలకు ఈ నెల 11వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టింది. వెయ్యి 32 కోట్లతో 18 నూతన కలెక్టరేట్లకు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నది. 26 జిల్లా కలెక్టరేట్లకు టెండర్లు పిలిచారు. వీటిలో 21 జిల్లాల్లో అధికార నివాస గృహాల నిర్మాణం చేపట్టనున్నది. ఖమ్మం, మెదక్, కొత్తగూడెం జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. మంచిర్యాల, నిర్మల్, వరంగల్‌ రూరల్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాలకు ప్రత్యామ్నాయ భూసేకరణ కోసం ప్రతిపాదించారు. సిరిసిల్లతో పాటు సిద్దిపేట, 17న సూర్యాపేటలో కూడా సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అటు మిగతా జిల్లా కేంద్రాల్లో మంత్రులు భూమి పూజ చేయనున్నారు. వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వనపర్తికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ శంకుస్థాపన చేస్తారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో జరిగే భూమి పూజ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొంటారు. పెద్దపల్లిలో హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, వికారాబాద్‌ లో మంత్రి మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మంత్రి లక్ష్మారెడ్డి, నిజామాబాద్‌తో పాటూ కామారెడ్డిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి , నాగర్‌ కర్నూల్‌ లో మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేస్తారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి పద్మారావు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో స్పీకర్‌ మధుసూదనాచారి, భువనగిరి యాదాద్రి జిల్లాలో మంత్రి జగదీశ్‌ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather
Review overview
NO COMMENTS

Sorry, the comment form is closed at this time.